సాధారణ రాజకీయాల్ని మించి సినీ పరిశ్రమలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గడచిన రెండు మూడు ఎన్నికల్ని విశ్లేషిస్తే సినీ రంగంలో రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతుంటుంది. నటులు శివాజీ రాజా, నరేష్ మధ్య గతంలో జరిగిన 'మా' గొడవలు సినీ పరిశ్రమ పరువుని బజారుకీడ్చేశాయి. అంతకు ముందు కూడా గొడవలు తీవ్రస్థాయిలో జరిగాయి. పెద్దలు కల్పించుకుని, పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యుల సంఖ్య మరీ ఎక్కువేమీ కాదు.
ఎవరు గెలిచినా 'మా' నిర్ణయాలకు విలువ వుండదని ఎన్నో సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా. అయినా కొందరి మధ్య ఆధిపత్య పోరు 'మా' ఎన్నికల్ని జుగుప్సాకరంగా మార్చేస్తున్నాయనే ఆవేదన చాలామందిలో వుంది. ఇంకో వైపున ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమేననీ, అంతిమంగా తమదంతా సినీ కుటుంబమనీ, తాము సినీ కళామతల్లి బిడ్డలమని చెబుతుంటారు మరికొందరు. ఈసారి ఎన్నికల్ని జీవిత, ఆమె భర్త రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కన్పిస్తోంది.
సీనియర్ నటుడు నరేష్ ప్యానల్ పోటీలోకి దిగింది. ప్రచారం కూడా గట్టిగానే చేయబోతోంది. ఖర్చు గతంలో ఎన్నడూ లేని విధంగా వుండబోతోందని సమాచారమ్. నరేష్ ప్యానల్, సూపర్ స్టార్ మహేష్‌ని కలిసినప్పటికీ, మహేష్ ఇలాంటి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని మించి తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలున్నాయనీ, అప్పుడే అవి భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయని గత 'మా' ఎన్నికల అనుభవాల్ని ఉటంకిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు.