రాజకీయాల్లో సినీ నటుల ప్రస్థానం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో రాజకీయాలు, సినిమాలు కలగలిసిన పరిస్థితుల్ని చూస్తున్నాం. తెలుగులో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఓ సంచలనం. రాజకీయ పార్టీ పెడుతూనే, అతి తక్కువ సమయంలో అధికార పీఠమెక్కారు. అయితే, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టినా అధికారంలోకి రాలేకపోయారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలనే కసితో ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీతో కాకుండా, అప్పటికే వున్న రాజకీయ పార్టీలకు సినిమా గ్లామర్ అందించిన నటీనటులు ఎందరో కన్పిస్తారు తెలుగులో.
తమిళంలోనూ అంతే. తాజాగా తమిళ సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, రాజకీయాల్లోకి రావాలనుకుంటోంది. గతంలో ఆమె తండ్రి శరత్ కుమార్ రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో విజయ్‌కాంత్, కమల్‌హాసన్ తదితరుల రూపంలో సినీ గ్లామర్ కనిపిస్తోంది. విశాల్ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో వున్నాడు. విశాల్‌కి మంచి స్నేహితురాలైన వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రస్తుతం రాజకీయాల్ని అధ్యయనం చేసే పనిలో వుందట.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం వరలక్ష్మి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. విశాల్ కూడా అప్పుడే రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. కర్నాటక రాజకీయాల్లో ఉపేంద్ర యాక్టివ్ అవుతున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన రాజకీయ కార్యాచరణను ప్రకటించేశాడు. ఏదిఏమైనా రాజకీయం అంటే సేవ, సినీ గ్లామర్ రాజకీయాల్లో రాణించిన సందర్భాలూ వున్నా, అవమానాలు తక్కువేం కాదు. అవమానాల్ని తట్టుకుంటే రాజకీయాల్లో నిలబడవచ్చు.