అప్పుడెప్పుడో ఐశ్వర్యారాయ్, ప్రశాంత్ జోడీగా వచ్చిన 'జీన్స్' సినిమాలో బామ్మ పాత్రలో నటించింది సీనియర్ నటి లక్ష్మీ. ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లే అయ్యింది. అప్పటికి లక్ష్మీది మరీ బామ్మ వయసు అయితే కాదు. ఓ మోస్తరు మిడిల్ ఏజ్ ఉమెన్. కానీ తల పండిన బామ్మ గెటప్‌లో కనిపించింది. తల పండిన బామ్మ అనేది గెటప్ మాత్రమే కానీ ఆమె పాత్ర మాత్రం చాలా జోష్‌తో కూడుకున్నది ఆ సినిమాలో.
అయితే ఇప్పుడీ ప్రస్థావన ఎందుకొచ్చిందీ అంటే, తాజాగా మరోసారి లక్ష్మీ బామ్మ గెటప్‌లో దర్శనమిచ్చారు. అదీ సమంత నటిస్తున్న 'ఓ బేబీ' సినిమా కోసం. లేటెస్ట్గా బయటికి వచ్చిన ఈ సినిమాలోని ఓ స్టిల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అప్పటి 'జీన్స్'లో లక్ష్మి నటించిన బామ్మ పాత్రనే తలపిస్తోంది ఈ స్టిల్‌లో లక్ష్మి పాత్ర. సమంతతో జోష్‌గా డాన్స్ చేస్తున్న స్టిల్ ఇది. అప్పటికీ, ఇప్పటికీ లక్ష్మి వయసులో చాలా డిఫరెన్స్ ఉంది. కానీ జోష్‌లో మాత్రం అస్సలు డిఫరెన్సే లేకపోవడం అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది.
ఒకప్పుడు హీరోయిన్గా మెప్పించిన లక్ష్మీ తర్వాత పలు రకాల హుందా పాత్రలు పోషించారు.. తల్లిగా, అత్తగా రకరకాల క్యారెక్టర్లు పోషించారు. పోషిస్తూనే ఉన్నారు. అయితే 'ఓ బేబీ'లో ఆమె పాత్ర మాత్రం అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో సమంతే బామ్మ పాత్ర పోషిస్తోంది అని ఇంతవరకూ ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్గా బామ్మ పాత్రలో లక్ష్మీ దర్శనమిచ్చింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ, 'తనే నేను నేనే తను..'అనే అర్ధమొచ్చేలా క్యాప్షన్ పెట్టి సమంత కన్ఫ్యూజ్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటనేది సినిమా విడుదలైతే కానీ తెలీదు.