తమిళంలో నయనతార తర్వాత మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది ముద్దుగుమ్మ త్రిష. ఎంగేజ్‌మెంట్, పెళ్లి.. కాన్సిల్.. ఈ ప్రొసీజర్ తర్వాత కెరీర్‌లో త్రిషకు బాగా కలిసొచ్చింది. ఎప్పుడయితే వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలనుకుందో అప్పటి నుండీ కెరీర్‌లో బాగా బిజీ అయిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు, ఊహించని ఆఫర్లు త్రిష తలుపు తట్టాయి. దాంతో ఆ తర్వాత ఇక పెళ్లి ఆలోచనే చేయలేదు త్రిష. ఇప్పటికే త్రిష చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి.
వీటిలో ఎక్కువ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలే. ఇటీవల '96' మూవీ త్రిషకు సూపర్ సక్సెస్‌తో పాటు, మంచి పేరు తీసుకొచ్చింది. ఎన్నాళ్లగానో సూపర్‌స్టార్ రజినీకాంత్తో నటించాలన్న కోరిక కూడా త్రిషకి ఈ మధ్యనే తీరింది 'పేట' సినిమాతో. ఇక తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక ఒక్కటీ మిగిలుంది. ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోంది. చిరంజీవి ఫామ్‌లోకి వచ్చాక ఆయన సరసన నటించేందుకు సీనియర్ హీరోయిన్ల పేర్లు లిస్టులో వచ్చి చేరుతున్నాయి. వారిలో త్రిష పేరు కూడా ఉంది.
చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నయనతార 'సైరా'లో నటిస్తోంది కాబట్టి, ఈ సినిమా కోసం హీరోయిన్‌గా త్రిష, అనుష్క పేర్లు పరిశీలిస్తున్నారు. చూడాలి మరి త్రిషను ఆ అదృష్టం వరిస్తుందేమో. గతంలో 'స్టాలిన్' సినిమాలో చిరుతో నటించింది త్రిష. మరోవైపు తమిళంలో మురుగదాస్ శిష్యుడు, 'జర్నీ' ఫేమ్ శరవణన్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకి తాజాగా త్రిష సైన్ చేసింది. ఈ సినిమాకి మురుగదాస్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.