గత కొన్ని రోజులుగా పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారిపోయాడు అలీ. తన ఎత్తుగడలు అనుసరిస్తున్న వ్యూహాలు ఎవరికీ అర్థం కావడం లేదు. అలీ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. 'నిజాయతీతో పవన్‌ని మించిన వాడు లేడు' అని అలీ చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాంటి అలీ వై.కా.పాలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి. జగన్‌ని కలుసుకున్నప్పటి ఫొటో కూడా బయటకు వచ్చింది. దీనిపై అలీ స్పందించలేదు.
అలీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వై.కా.పాలో అలీ చేరడం ఖాయం అనుకున్నారంతా. అయితే... అలీ మళ్లీ యూ టర్న్ తీసుకున్నాడు. ఒకేరోజు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌లను కలుసుకుని కన్‌ఫ్యూజ్ చేయడం మొదలెట్టాడు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గుంటూరు (తూర్పు) నియోజకవర్గం సీటు తనకి కావాలని అలీ డిమాండ్ చేస్తున్నాడట.
ఆ సీటు ఎవరిస్తే ఆ పార్టీ తరపున పని చేయాలని అలీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే... అటు వైకాపా గానీ, ఇటు తెదేపా గానీ గుంటూరు సీటుని అలీకి ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అందుకే అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ పవన్ పక్షానికే చేరినట్టు సమాచారం. 'పవన్‌ని విడిచేది లేదు. పవన్ పక్కనే ఉంటా' అంటూ అలీ తన సన్నిహితులతో కూడా చెబుతున్నాడట. అంటే అలీ త్వరలో గ్లాసు పట్టుకోవడం ఖాయం.