టాలీవుడ్‌లో కథల కొరత కనిపిస్తోంది. దానికి తోడు హీరోలు.. కథలకున్న విలువ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కొత్త పాయింట్ల కోసం జల్లెడ పడుతున్నారు. స్టార్ దర్శకులే కథలు చెప్పాలన్న రూలు లేదు. కొత్త దర్శకుడు, కొత్త రచయిత ఎవరైనా ఫర్వాలేదు. కొత్త కథ ఉందంటే.. `రండి రండి రండి.. దయ చేయండి' అంటూ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అదే చేస్తున్నాడు.
'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫ్లాప్ ప్రభావం బన్నీపై చాలా పడింది. ఆ పరాజయంలోంచి తప్పులు నేర్చుకునే పనిలో ఉన్నాడు బన్నీ. త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయినా.. దాన్ని పట్టాలెక్కించడానికి ఏమాత్రం కంగారు పడడం లేదు. స్క్రిప్టు పక్కాగా ఓకే అయిన తరవాతే... షూటింగ్ అంటున్నాడు. ఈలోపుగా ఖాళీగా ఉండడం ఎందుకని.. కొత్త కథలు వింటున్నాడు.
టాలీవుడ్‌లో దర్శకులుగా, రచయితలుగా ఎదగాలని ఆశపడుతున్న కొంతమందిని గుర్తించిన బన్నీ... వాళ్లు చెబుతున్న కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడని టాక్. అందులో బన్నీకి కొన్ని మంచి కథలు దొరికాయని, వాటిని సానబెడితే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాడట. ఈ కథలన్నీ బన్నీనే చేయాలని రూలు లేదు. మెగా కాంపౌండ్‌లో చాలామంది హీరోలున్నారు. గీతా ఆర్ట్స్, జీఏ 2 సంస్థలు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాయి. వాటి కోసం కూడా ఈ కథలు పనికొస్తాయన్నది బన్నీ ఆలోచన.