సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ ఎలా చేసుకోవాలా..? అంటూ ఇప్పటి నుంచే కొంతమంది సినీ సెలబ్రెటీలు ప్రణాళికలు వేసేసుకుంటున్నారు. చాలామంది దృష్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలవైపు మళ్లుతోంది. ఎందుకంటే అక్కడ సంక్రాంతి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోడిపందాలకు తూ.గో, ప.గో జిల్లాలు బాగా ఫ్యామస్. అందుకే సంక్రాంతి పండగ అనగానే... ఆ జిల్లాలే గుర్తొస్తాయి.
ఈసారి అల్లు అర్జున్ అక్కడే తన పండగ చేసుకుంటున్నాడు. సంక్రాంతి కోసం.. కుటుంబంతో సహా పాలకొల్లు వెళ్తున్నాడు. అల్లు అర్జున్ సొంత ఊరు పాలకొల్లు. అల్లు రామలింగయ్య పుట్టి పెరిగింది అక్కడే. ఇప్పటికీ అల్లు వంశస్థులు కొంతమంది పాలకొల్లులో ఉన్నారు. వాళ్లని చూడ్డానికి, పండగ రోజులు అక్కడ గడపడానికి అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్తున్నాడు.
పండగ నుంచి తిరిగొచ్చాక.. త్రివిక్రమ్ సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు బన్నీ. 2018లో బన్నీ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. అది కూడా బాగా నిరాశ పరిచింది. అందుకే తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. బన్నీ - త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికి రెండు సినిమాలొచ్చాయి. అవి రెండూ అభిమానుల్ని అలరించాయి. అందుకే ఈ హ్యాట్రిక్ కాంబోపై అందరి దృష్టీ పడింది.