మహేష్‌బాబు హీరోగా రూపొందిన 'అతిధి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ అమృతారావ్. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదీ భామ. ఎందుకిలా.? అని ప్రశ్నిస్తే ఇన్నేళ్ల తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలతో సమాధానమిచ్చింది. 'అతిధి' చేస్తున్నప్పుడే మూడు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే మూడు సినిమా ఆఫర్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆ సినిమాల్లో విషయం లేదు. హీరోయిన్ పాత్రకి విలువ లేదు.
అప్పుడే అర్ధమైంది తెలుగులో హీరోయిన్స్‌కి తగిన ప్రాధాన్యత ఉండదనీ.. అంటూ అమృతారావ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హీరోయిన్స్‌లో కొంతమందికి ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. మొన్న తాప్సీ, అంతకు ముందు ఇలియానా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా మందే ఉంటారు. రాధికా ఆప్టే కూడా ఇలానే తెలుగు సినీ పరిశ్రమ మీద బురద చల్లేసింది. ముందు నోరు జారడం, తర్వాత క్షమాపణ చెప్పడం అందాల భామలకు అలవాటే.
తాప్సీ నోరు జారి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అమృత కూడా ఓ మంచి ఛాన్స్ దక్కించుకుంటే తూచ్ తెలుగు సినిమా చాలా గొప్ప అనేస్తుంది. 'అతిధి' సినిమా టైంలో అమృత దర్శక, నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టేసిందనే ప్రచారం జరిగింది. అలాంటి అమృతారావ్‌కు టాలీవుడ్ మీద విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిది.? బాలీవుడ్‌లో ఆటలు చెల్లక సౌత్ సినిమాల పంచన చేరి, గుర్తింపు తెచ్చుకున్నాక, దక్షిణాది మీద విషం చిమ్మే ఇలాంటి భామల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే.