దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది దర్శకుడు క్రిష్‌కి. 'మణికర్ణిక' విషయమై జరుగుతున్న రాధ్ధాంతంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చిత్ర నిర్మాత కమల్‌జైన్ క్రిష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా రిలీజయ్యాక క్రిష్ చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయనీ, సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనీ, ఇక్కడితో ఈ వివాదానికి క్రిష్ ముగింపు పలకకపోతే చట్టపరమైన చర్చలు తప్పవనీ ఆయన హెచ్చరించారు.
'మణికర్ణిక'ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయాక క్రిష్ ఈ సినిమాని వివాదాస్పదం చేయడం దారుణం అన్నారు. కంగనా చొరవతో సినిమాని పూర్తి చేయగలిగామనీ, అయినప్పటికీ అన్ని విషయాలూ క్రిష్‌తో కూడా సంప్రదించి, అతని అనుమతి తీసుకునే చేశామనీ, ఇప్పుడిలా వివాదాలు రాజేయడమేంటనీ క్రిష్ మీద అసహనం వ్యక్తం చేశారు కమల్ జైన్.
క్రిష్‌కి ఏమైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చనీ, అవమానం జరిగిందనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చనీ ఉచిత సలహా ఇచ్చారాయన. వ్యయ, ప్రయాసలు ఓర్చి సినిమాని తెరకెక్కించింది, ఆ సినిమాని బలిపశువుని చేయడానికి కాదని కమల్‌జైన్ స్సష్టం చేశారు. నిర్మాత కూడా తనకు వ్యతిరేకంగా మారిపోయాక క్రిష్ ఇంకెంత గగ్గోలు పెట్టినా దండగే.