బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ... ఏ నోట విన్నా క్రిష్ - కంగనా రనౌత్ వివాదం గురించిన మాటే. ఈ ఎపిసోడ్‌లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే విషయంలో భీకరమైన చర్చ జరుగుతోంది. కొంతమంది క్రిష్‌ని సపోర్ట్ చేస్తే, ఇంకొంతమంది కంగన వెంట ఉన్నారు. ఈచిత్రంలో కీలక సభ్యుడైన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ వివాదం గురించి తొలిసారి పెదవి విప్పారు.
క్రిష్ - కంగన విషయంలో మీ మాటేంటి? ఈ వివాదంలో తప్పు ఎవరివైపు ఉంది? అనే ప్రశ్నకు ఆచి తూచి స్పందించారు. ''నేను ఈ చిత్రానికి కథ మాత్రమే ఇచ్చాను. సెట్స్‌కి వెళ్లింది చాలా తక్కువ. కొన్నిసార్లు కంగనా నాకు సలహాలూ సూచనలు ఇచ్చింది. ఇంకోన్ని సార్లు క్రిష్ సలహాలు అందించాడు. ఈ విజయంలో ఇద్దరి భాగస్వామ్యం ఉంది'' అని కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్న మాదిరిగా సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదించే సమయం ఇది, ఈ వివాదాన్ని పక్కన పెట్టి, ఫలితాన్ని స్వీకరించాలి అంటూ.. ముక్తాయించాడు బాహుబలి రచయిత. అయితే... సినీ జనాల మాట మరోలా ఉంది. అసలు ఈ వివాదానికి కారణమే విజయేంద్ర ప్రసాద్ అని, ఆయన జోక్యంతోనే కంగన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టిందని, ఈ వివాదం వెనుక సూత్రధారీ, పాత్రధారీ ఆయనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.