ఏ చిత్రసీమలో అయినా కథానాయికల జీవన ప్రయాణం చాలా తక్కువ. రెండేళ్లకే బోర్ కొట్టేస్తారు. ఐదేళ్లు కెరీర్ని కొనసాగించడం చాలా గొప్ప. అలాంటిది 5 కాదు, 10 కాదు ఏకంగా 14 ఏళ్ల పాటు తన కెరీర్ని కొనసాగించింది అనుష్క. దాదాపు పదేళ్ల నుంచీ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో తనదే అగ్రస్థానం. స్వీటీ అంటూ ముద్దుగా పిలుచుకునే జేజమ్మ.. కెరీర్ మొదలై నేటితో సరిగ్గా 14 ఏళ్లు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది అనుష్క.
‘నేను సినిమాల్లోకి నాకు నేనుగా రాలేదు. అలా జరిగిపోయింది. పూరీ జగన్నాథ్ ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్ ఒకరు నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ సర్ చెప్పడంతో హైదరాబాద్కు వచ్చాను. అలా నాకు అవకాశం వచ్చింది. నేను కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు అవుతోంది. నా జీవితాన్నే మార్చేసినవారందరికీ, నాగార్జున, పూరీ జగన్నాథ్కి, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం మాధవన్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం స్వీటీ చాలా నాజూకుగా తయారైంది.