క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ బయోపిక్' మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9న విడుదలై మంచి సక్సెస్ టాక్ తో నడుస్తుంది. బాలకృష్ణ తన తండ్రి రామారావు గారి పాత్ర పోషించగా, బాలీవుడ్ నటి విద్యాబాలన్ 'బసవతారకం' పాత్రలో నటించారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారి సమకాలికుల పాత్రలు పోషించారు. ఇప్పటికే, ఎన్టీఆర్ సినిమాపై టాలీవుడ్ లో ప్రశంసల వర్షం కురుస్తుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. గురువారం రాత్రి విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ లో చంద్రబాబు నాయుడు.. బాలకృష్ణ, క్రిష్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ మంత్రులతో కలిసి 'ఎన్టీఆర్ కథానాయుడు' చిత్రాన్ని వీక్షించిన అనంతరం మీడియాతో ప్రసంగించారు. సినిమా చాలా బాగుందని, 30 ఏళ్ళ రామారావు గారి జీవిత చరిత్రను 3 గంటల్లో చక్కగా చూపించారని 'ఎన్టీఆర్' చిత్రబృందాన్ని ప్రశంసించారు.
సినిమాలో మీ పాత్ర ఎలా అనిపించింది? అని ఒక విలేఖరు అడిగిన ప్రశ్నకు 'ఆ విషయం నా కన్నా మీరే బాగా చెప్తారు' అన్నారు. కేవలం నా పాత్రే కాదు, అన్ని పాత్రల్లోనూ అందరూ బాగా నటించారు అని నటీనటులు అందరిని కొనియాడారు. సినిమా చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయని, ఆ మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, కార్య దక్షతను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ ని, తన మావయ్య పాత్రలో ఒదిగిపోయిన నందమూరి బాలకృష్ణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.