ఈ సంక్రాంతికి బోణీ కొట్టిన సినిమా 'కథానాయకుడు'. ఎన్టీఆర్ బయోపిక్ కావడం, ఆ పాత్రలో ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కనిపించడం, తెలుగు నాట పేరొందిన చాలామంది కథానాయికలు, నటీనటులు ఈ సినిమాలో పలు పాత్రలు పోషించడంతో... 'ఎన్టీఆర్'పై దృష్టి పడింది.
విడుదల రోజున టాక్ కూడా బాగానే ఉండడంతో.... 'ఎన్టీఆర్' వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయం అనుకున్నారంతా. కానీ... కలక్షన్లు మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. తొలి రోజు గ్రాస్ రూ. 7 కోట్ల వరకూ వచ్చింది. రెండో రోజు షేర్ రూ.1.10 కోట్లకు పడిపోయింది. ఇది భారీ డ్రాప్ కిందే లెక్క. గురువారం తమిళ డబ్బింగ్ బొమ్మ 'పేటా' విడుదలైంది.
రజనీ సినిమా అంటే మాస్ లో మంచి ఫాలోయింగ్. మల్టీప్లెక్స్‌లలో 'పేటా'కి వసూళ్లు సరిగా లేవు గానీ, బీసీలలో ఆ ప్రభావం చూపిస్తోంది. అందుకే...రెండో రోజు 'ఎన్టీఆర్ కథానాయకుడు' వసూళ్లు మరీ దారుణంగా పడిపోయాయి. మూడో రోజున 'వినయ విధేయ రామ' ప్రభావం తప్పకుండా ఉంటుంది. రాను రాను... బాలయ్య సినిమాకి బాక్సాఫీసు దగ్గర కష్టాలు తప్పకపోవొచ్చు అనేది విశ్లేషకుల మాట.