సినిమా అంటేనే అంత. వస్తే.. రూపాయికి పది రూపాయలు వస్తాయ్. లేదంటే పదికి పదీ పోతాయ్. ఇందుకు నిదర్శనం.. ఎన్టీఆర్ - కథానాయకుడు. విడుదలకు ముందు భారీ అంచనాలు మోసుకొచ్చిందీ సినిమా. బాలయ్యకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన ప్రతీ సినిమా హిట్టయ్యింది. గత రెండు మూడేళ్ల నుంచీ బాలయ్యే సంక్రాంతి హీరో. అందుకే ఎన్టీఆర్‌బయోపిక్ ని గట్టిగా నమ్మారు జనం. బయ్యర్లు ఈ సినిమా కొనడానికి ఎగబడ్డారు.
మొత్తానికి థియేటరికల్ రైట్స్ రూపంలో రూ.71 కోట్లు వచ్చాయి. తీరా చూస్తే... కథానాయకుడు డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తొలి రోజు కాస్తో కూస్తో ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రం... రెండో రోజుకే ఖాళీ థియేటర్లతో దర్శనమిచ్చింది. వరుసగా సినిమాలు రావడంతో... ఎన్టీఆర్ శోభ బాగా తగ్గిపోయింది. మొత్తానికి ఈ సినిమా రూ21 కోట్లు మాత్రమే దక్కించుకుంది. అంటే రూ...50 కోట్లు నష్టమన్నమాట.
టాలీవుడ్‌లో అతిపెద్ద డిజాస్టర్లలో ఎన్టీఆర్ - కథానాయకుడు ఒకటిగా నిలిచింది. ఈ నష్టాల్ని పూడ్చడానికి `మహానాయకుడు` సినిమాని.. ఫ్రీగా ఇచ్చేశాడు బాలయ్య. కానీ... ఎంత ఫ్రీగా ఇచ్చినా రూ.50 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. `ఎన్టీఆర్ మహానాయకుడు` కూడా విడుదలై.. ఆ సినిమా వసూళ్ల లెక్కలు బయటకు వస్తే తప్ప, ఎన్టీఆర్ వల్ల బయ్యర్లు ఎంత నష్టపోయారన్న విషయం తేలదు.