ఎంతవారలైనా.. చేతిలో హిట్లు ఉండాల్సిందే. ఒకట్రెండు ఫ్లాపులు ఎదురయ్యాయంటే... కెరీర్‌లో కుదుపులు, మలుపులు మొదలైపోతాయి. మరీ ముఖ్యంగా కథానాయికల విషయంలో జాతకాలు రాత్రికి రాత్రే తారు మారు అవుతుంటాయి. వరుసగా ఫ్లాపులు తగులుతుంటే `ఐరెన్ లెగ్` అనే ముద్ర పడిపోతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి హిట్టు కొట్టడం తప్ప ఇంకో మార్గం కనిపించదు. హిట్టు కొట్టాలంటే అవకాశాలు రావాలి కదా? అందుకే పారితోషికం తగ్గించుకుని ఊరిస్తుంటారు కథానాయికలు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి అలానే ఉంది. 2017 వరకూ రకుల్ కెరీర్ భీకరమైన స్పీడుతో సాగింది. టాప్ స్టార్లందరితోనూ జోడీగా నటించింది. కానీ 2018లో ఆమె జాతకం పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆ యేడాది ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. తెలుగులో ఆమె నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. పైగా కొత్త కథానాయికలతో పోటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు రకుల్ హవా అంతంతమాత్రమే. అందుకే.. రకుల్ పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధమైంది.
రకుల్ చేతిలో విజయాలున్నప్పుడు తన పారితోషికం ఇంచుమించుగా 1.25 కోట్లు. ఇప్పుడు రూ.70 నుంచి 80 లక్షలకు సర్దుకుపోతోందట. `వెంకీమామ`లో చైతూ పక్కన కథానాయికగా నటిస్తోంది రకుల్. ఈ సినిమా కోసం 75 లక్షలు అందుకొందట. రకుల్ ప్రీత్ ఇంత భారీ రిబేటు ప్రకటించినా అవకాశాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. రకుల్ నటించిన `దేవ్` సినిమా ఈనెల 14న విడుదల అవుతోంది. ఆ సినిమా అటూ ఇటూ అయితే.. రకుల్ పారితోషికం మరింత దిగజారిపోవడం ఖాయం.