పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్‌లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు కీలక నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నాడు పూరి. కథానాయికగా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విలన్ కూడా సెట్టయిపోయాడు. బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే రామ్‌తో ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడు.
సింగ్ ఈజ్ కింగ్ లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధన్షు. రజనీ సినిమా రోబో 2.ఓలో కూడా నెగిటీవ్ ఛాయలున్న ఓ పాత్ర చేశాడు. తెలుగులో ఇదే తన తొలి చిత్రం. త్వరలోనే సుధన్షు `శంకర్` సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. రెండో కథానాయిక కోసం చిత్రబృందం గట్టిగానే గాలిస్తోంది. ఆ అవకాశం నభా నటేశాకి దక్కినట్టు తెలుస్తున్నా, మరో బెటర్ ఆప్షన్ కోసం పూరి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.