కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసే దర్శకుడు త్రివిక్రమ్. స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా సరే - ఆ ఎమోషన్‌ని వదిలిపెట్టడు. మాస్ సన్నివేశాలకంటే, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలవైపే దృష్టి పెడతాడు త్రివిక్రమ్. టైటిళ్లు కూడా అలాంటివే ఎంచుకుంటాడు. అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా కోసం ఈసారీ అదే పంథాలో వెళ్లబోతున్నాడు. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా కోసం `నాన్న - నేను` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్‌తో సన్నాఫ్ సత్యమూర్తి తెరకెక్కించాడు త్రివిక్రమ్. టైటిల్‌కి తగ్గట్టే సినిమా అంతా నాన్నతో ఉన్న అనుబంధం చుట్టూనే తిరుగుతుంది. జులాయిలో కూడా నాన్న పాత్రకు ప్రాధాన్యం ఇచ్చాడు త్రివిక్రమ్. ఈసారీ.. అదే స్టైల్‌లోనే ఈ సినిమా కథని అల్లుతున్నట్టు సమాచారం. అంతేకాదు... ఓ అబద్దం చుట్టూ ఈ కథ తిరగబోతోందట. అనుకోకుండా కథానాయకుడు ఓ అబద్ధం ఆడతాడని, దాన్ని నిజం చేయడానికి చివరి వరకూ ప్రయత్నిస్తుంటాడని, చివరికి ఆ అబద్దాన్ని నిజం చేసేస్తాడని సమాచారం. మరి నాన్నతో ఆ తనయుడు ఆడిన అబద్దమేమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.