కోడి రామకృష్ణ.. దాదాపుగా 140 సినిమాలు తీసిన దర్శక దిగ్గజం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన రికార్డు దాసరి నారాయణరావుది. ఆయన 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ తరవాత.. ఆ రికార్డుకి చేరువగా వెళ్లింది కోడిరామకృష్ణనే. గత కొంతకాలంగా కోడి రామకృష్ణ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మనసులో సినిమాల్ని తీయాలి అనే బలమైన కోరిక ఉన్నా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లలేదు.
అప్పట్లో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేద్దామనుకున్నారు కోడి రామకృష్ణ. `విక్రమ సింహా` అనే టైటిల్‌తో సినిమా మొదలెట్టి, 50 శాతం షూటింగ్ పూర్తి చేశారు. కానీ దర్శకుడికీ, నిర్మాతకూ గొడవ అవ్వడం వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. కోడి రామకృష్ణ... సత్యసాయిబాబా భక్తుడు. బాబా మరణంతో తల్లడిల్లిపోయిన కోడిరామకృష్ణ... సత్యబాబాపై ఓ సినిమా తీయాలని సంకల్పించారు. కథ సిద్ధమైంది. పుట్టపర్తిలో షూటింగ్ కూడా మొదలైంది. కానీ.. కొద్దిరోజులు షూటింగ్ చేశాక ఆగిపోయింది.
భారత్ బంద్.. కోడి రామకృష్ణ సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి. దానికి సీక్వెల్‌గా `ప్రపంచ బంద్` అనే స్క్రిప్టు రాసుకున్నారు కోడి రామకృష్ణ. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. అర్జున్ కథానాయకుడిగా ఓ సినిమా మొదలెట్టి, కొన్ని రోజులు షూటింగ్ చేశాక ఆపేశారు. అంకుల్ ఆంజనేయస్వామి అనే పేరుతో ఓ కథ రాసుకున్నారు కోడి రామకృష్ణ. నటీనటుల ఎంపిక కూడా పూర్తయ్యింది. కానీ సెట్స్‌పైకి వెళ్లలేదు.