ఈ నెల 21న రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి 'అంతరిక్షం', ఇంకోటి 'పడి పడి లేచె మనసు'. ఈ రెండూ మెగా సినిమాలే. మెగా ప్రిన్స్ హీరోగా 'అంతరిక్షం' రూపొందితే, మెగా కాంపౌండ్‌కి అత్యంత సన్నిహితుడైన శర్వానంద్ 'పడి పడి లేచె మనసు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్ కోసం బన్నీ వస్తే, వరుణ్ కోసం చరణ్ వచ్చాడు. నిజానికి శర్వానంద్, చరణ్‌కి మంచి స్నేహితుడు. ఈ సంగతి పక్కన పెడితే, ఈ రెండు సినిమాలు క్లాస్ టచ్‌తోనే ఉండబోతున్నాయి. కొంచెం మాస్ టచ్ 'పడి పడి లేచె మనసు'లో ఉండొచ్చేమో. అయితే ఈ రెండు సినిమాలకీ ఓవర్సీస్‌లో మాంచి రెస్పాన్స్ వచ్చేలా ఉంది.
సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'అంతరిక్షం' తెలుగు తెరపై సరికొత్త ప్రయోగం. ఈ దర్శకుడి నుండి గతంలో 'ఘాజీ' సినిమా వచ్చింది. దాంతో సంకల్ప్‌రెడ్డి 'అంతరిక్షం'తో ఏం అద్భుతం చేయబోతున్నాడనే ఆశక్తి అందరిలోనూ నెలకొంది. మరోపక్క హను రాఘవపూడి 'పడి పడి లేచె మనసు' సినిమాతో సత్తా చాటాలనుకుంటున్నాడు. అతనికీ విలక్షణ దర్శకుడనే పేరుంది. ఇటు హీరోల ఇమేజ్, అటు దర్శకుల ఇమేజ్, వీటితో పాటు ఈ రెండు సినిమాలపై క్రియేట్ అయిన ఆశక్తి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే, డిశంబర్ 21 తెలుగు సినిమాకి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. అలాగే ఈ రెండు సినిమాలూ ఓవర్సీస్‌లోనూ వసూళ్లు కొల్లగొట్టేయచ్చు.