టాలీవుడ్‌లో ప్రస్తుతం ఊపిరి సలపని బిజీలో ఉన్న కథానాయిక ఎవరంటే.. రష్మికా మండన్నా అనే చెప్పాలి. ఛలో, గీత గోవిందం, దేవదాస్ ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ అందుకుంది. గీత గోవిందం ఎప్పుడైతే హిట్టయిందో అప్పుడో స్టార్ కథానాయికల సరసన చేరిపోయింది రష్మిక. ఇప్పుడు ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో రష్మిక నటిస్తోంది. మహేష్ - అనిల్ రావిపూడి సినిమాలోనూ తనే నాయిక. అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలోనూ తననే కథానాయికగా ఎంచుకున్నారు. అలా... మూడు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది.
నిజానికి రష్మిక చేతిలో ఇంకొన్ని సినిమాలు ఉండాల్సింది. తన దగ్గరకు వచ్చిన కొన్ని కథల్ని తిరస్కరించాల్సివచ్చింది. డేట్లు సర్దు బాటు చేయలేకపోవడం వల్ల కొన్ని పెద్ద పెద్ద ఆఫర్లని కూడా వదులుకోవాల్సివచ్చింది. కన్నడలోనూ రష్మిక బిజినే. ఇటు తెలుగు, అటు కన్నడ అంటూ రెండు పడవలపైనా ప్రయాణం చేస్తోంది. రష్మిక డిమాండ్ ఎంతలా ఉందంటే... తను అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్దమవుతున్నారు. కొన్ని సినిమాలకు నో చెప్పడం ఎలాగో తెలీక రెట్టింపు పారితోషికం డిమాండ్ చేస్తోంది రష్మిక. అలా చెబితే.. పారితోషికం ఇవ్వలేక వెళ్లిపోతారని. కానీ దానికి కూడా నిర్మాతలు రెడీ అంటున్నారు. రష్మిక మాయాజాలం అలా ఉంది మరి.