కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మణికర్ణిక' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్, షూటింగ్ చివరిలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దర్శకత్వం నుండి తప్పుకోగా ఆ బాధ్యతను కంగనా తన భుజాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే పరిస్థితి ఇప్పుడు తమిళ హీరో మాధవన్‌కి వచ్చింది. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' మూవీకి అనంత మహాదేవన్ దర్శకుడు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అనంత మహాదేవన్ దర్శకత్వం నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతను మాధవన్ స్వీకరించారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల దర్శకుడిగా మారాల్సి వచ్చింది అని తాజాగా ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి మాధవన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా సెట్స్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన డెడికేషన్‌కు 'రాకెట్రీ' టీమ్ ఆశ్చర్యపోతున్నారట.
నటుడిగానే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా మాధవన్‌ది విలక్షణ వ్యక్తిత్వం. అందుకే ఆయన తమిళ ఇండస్ట్రీకే కాదు, తెలుగు, హిందీ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. ఇటీవల 'సవ్యసాచి' సినిమాతో మాధవన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు కానీ, నెగిటివ్ రోల్ పోషించిన మాధవన్‌కి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.