ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత సినిమా 'సూపర్ డీలక్స్' వివాదాల్లోకెక్కింది. విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాపై హిజ్రా సంఘాలు ఆందోళనకు దిగాయి. అసలు మ్యాటరేంటంటే, ఈ సినిమాలో హీరో విజయ్‌సేతుపతి హిజ్రా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే ఈ పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. సినిమా కూడా మంచి విజయం అందుకుంది.
అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం ఇప్పుడు హిజ్రాల ఆగ్రహానికి కారణమైంది. హిజ్రా పాత్రలో ఉన్న విజయ్‌సేతుపతి పిల్లల్ని కిడ్నాప్ చేసి, వారిని వేరే వాళ్లకి అమ్మేసి, తద్వారా డబ్బులు సంపాదించే ఓ సీన్ ఉంది. ఈ సన్నివేశం పట్ల హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. హిజ్రాలు అలా ఎప్పుడూ చేయలేదనీ, పిల్లలకు హాని కల్గించే పనుల జోలికి హిజ్రాలు ఎప్పుడూ పోరనీ, సినిమాలో ఈ సీన్ మా మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందనీ వారు ఆందోళన చేశారు.
సినిమా నుండి ఈ సీన్ తొలిగించాలనీ లేదంటే సినిమాని పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం పట్ల చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. ఈ మధ్య మనోభావాల పేరు చెప్పి ఇలాగే సినిమాల్లోని పలు సన్నివేశాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కోసారి శృతి మించుతున్నాయి ఆ వివాదాలు. కొన్నిసార్లు వాటంతటవే సర్దుమనిగిపోతున్నాయి. మరి ఈ తాజా వివాదాన్ని 'సూపర్ డీలక్స్' టీమ్ సూపర్‌గా ఎలా పరిష్కరిస్తారో చూడాలిక.