ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయడంలో దిల్ రాజు సిద్దహస్తులు. పట్టిందల్లా బంగారం అన్నట్టు చేసిన ప్రతి సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టేది. కానీ గత ఏడాది దిల్ రాజు కి అస్సలు కలిసిరాలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దిల్ రాజుకి ఈ ఏడాది మొదట్లోనే ఎఫ్ 2 రూపంలో బంపర్ హిట్ వచ్చింది. విక్టరీ వెంకటేష్- వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన ఈ సినిమా 13 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్ళని దాటేసింది.
వెంకటేష్ మొదటినుంచి ఫ్యామిలీ హీరోనే. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అలరించటంలో దిట్ట. దాంతో ఎఫ్ 2 సినిమా విడుదలైన రోజు నుండే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. గత వారంలో టాప్ 15 చిత్రాల్లో ఒకటిగా ఉన్న ఎఫ్ 2 సినిమా, ఇప్పుడు వసూళ్ల పరంగా టాలీవుడ్ టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే 75 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ ఆనందంలో దిల్ రాజు ఎఫ్ 2 టీమ్ కి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారట.
ఎఫ్ 2 చిత్రబృందంలో 20 మంది స్టాఫ్ ని బ్యాంకాక్ టూర్ పంపించనున్నారట. అంటే దాదాపు 60-70 లక్షల ఖర్చు పెట్టుకుని మరీ.. స్టాఫ్ లో కొత్త ఉత్సాహం నింపేందుకు నిర్మాత దిల్ రాజు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఇకపోతే, దిల్ రాజు పీవీపీ సినిమా ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ దశలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది.