సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెలాఖరున విడుదలయ్యే సినిమాల సందడి షురూ అయ్యింది. వీటిలో ముఖ్యంగా అంచనాలు రేపుతోన్న సినిమా వీరనారి ఝాన్సీలక్ష్మీ భాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'మణికర్ణిక'. ఈ నెల 25న 'మణికర్ణిక' ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చారిత్రాత్మక చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ వీక్షించనున్నారట.
ఆయన కోసం స్పెషల్‌గా ఈ నెల 18న 'మణికర్ణిక' స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షోకి హీరోయిన్ కంగనాతో పాటు, చిత్ర యూనిట్ అంతా హాజరు కానుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకి అసలు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ సినిమా చివరి దశలో క్రిష్ దర్శకత్వం నుండి పక్కకు తప్పుకోవడంతో ఆ బాధ్యతను కంగనా స్వీకరించింది.
అయితే ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమాని పూర్తిగా కంగనా తన చేతుల్లోకి తీసేసుకుంది. దర్శకుడు క్రిష్‌తో పాటు, తన పేరు కూడా టైటిల్స్‌లో యాడ్ చేసుకుంది. అంతేకాదు, ప్రమోషన్స్‌లో కూడా క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. 'మణికర్ణిక' నాదే అంటూ కంగనా విసృతంగా ప్రచారం చేసుకుంటోంది. ఈ తరుణంలో విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ టైంలో అయినా క్రిష్ రంగంలోకి దూకుతాడా.? లేదా.? రాష్ట్రపతి స్పెషల్ షోకి క్రిష్ హాజరవుతాడా.? లేదా.? అనేది తెలియాల్సి ఉంది.