'ఎన్టీఆర్ - కథానాయకుడు' అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. 2019 ఘోర పరాజయాల్లో 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఒకటిగా మిగిలిపోతుంది. దాదాపు 70 కోట్లు పెట్టి ఈ సినిమా కొంటే, కేవలం 20 కోట్లే వచ్చాయి. అంటే.. 50 కోట్లు నష్టమన్నమాట. సినిమా తీసిన బాలకృష్ణ విడుదలకు ముందే లాభపడ్డారు. నష్టపోయింది ఈ సినిమాని ఎక్కువ రేట్లకు కొన్న బయ్యర్లే.
అందుకే పార్ట్ 2ని బాలయ్య ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. పార్ట్ 1 కొని నష్టపోయిన బయ్యర్లు... ఈ సినిమాతో తేరుకోవాలన్నది బాలయ్య ఆకాంక్ష. ఆ మేరకు బాలకృష్ణ కూడా నిర్మాతగా నష్టపోయినట్టే. అందుకే ఇప్పుడు ఆ నష్టాన్ని భరించడానికి డైరెక్టర్ క్రిష్ ముందుకొచ్చినట్టు సమాచారం. క్రిష్ తాను అందుకున్న పారితోషికంలో సగభాగం బాలయ్యకు తిరిగి ఇచ్చేసినట్టు టాక్.
''క్రిష్‌కు అందాల్సిన పారితోషికం ఎప్పుడో అందేసింది. అయితే.. అందులో సగం తిరిగి ఇచ్చేయాలని క్రిష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ బాలకృష్ణ ఒప్పుకోవడం లేదు. ఈ సినిమా కోసం క్రిష్ రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. ఫలితం ఎలాంటిదైనా ఆ కష్టాన్ని గుర్తించాల్సిందే. అందుకే బాలయ్య పారితోషికం తిరిగి తీసుకోవడానికి సముఖంగా లేరు'' అని ఇన్‌సైడ్ వర్గాలు తెలిపాయి.