దానయ్య - బోయపాటి శ్రీను మధ్య జరిగిన యవ్వారం... టాలీవుడ్లో కొత్త ప్రశ్నల్ని - కొత్త సందేహాల్నీ రేకెత్తిస్తోంది. బోయపాటి దర్శకత్వం వహించిన 'వినయ విధేయ రామ' సినిమాకి భారీ నష్టాలొచ్చాయి. పంపిణీ దారులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బోయపాటి శ్రీనుకి పారితోషికంగా ఇచ్చిన 15 కోట్లలో 5 కోట్లు తిరిగి ఇవ్వాలన్నది దానయ్య డిమాండ్.
ఈ విషయమై బోయపాటి ఆఫీసులో పంచాయితీ జరిగింది. పంచాయితీ పెద్దగా దిల్రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్, నల్లమలపు బుజ్జీ లాంటి పెద్దలు వెళ్లారని తెలుస్తోంది. పంచాయితీ అంటే... తిట్టుకోవడం మామూలేగా. బోయపాటి, దానయ్య ఇద్దరూ అసభ్య పదజాలంతో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారని బయటకు వార్తలొచ్చాయి.
అయితే... మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ సందర్భంలో దానయ్య బోయపాటిపై చేయి కూడా చేసుకున్నాడట. కాకపోతే దిల్రాజు అప్రమత్తమై, ఇద్దరినీ వారించడంతో ఫైట్ సీన్ తప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలేమిటన్నది బోయపాటికీ, ఆ గదిలో ఉన్న పెద్దలకే తెలియాలి.