కెరీర్‌లో హాఫ్ సెంచరీ కొట్టేసింది ముద్దుగుమ్మ హన్సిక. తెలుగులో 'దేశముదురు' సినిమాలో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని అయితే సొంతం చేసుకోలేకపోయింది. అమ్మడి బొద్దు ముద్దు అందాలకు తమిళ తంబీలు మాత్రం ఫుల్‌గా ఫిదా అయిపోయారు. అందుకే అక్కడ ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది.
కోలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉండడంతో, టాలీవుడ్‌కి చిన్న గ్యాప్ ఇచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులో హన్సిక నటించబోతోంది. యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటించేందుకు హన్సిక సైన్ చేసింది. నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఇదో రొమాంటిక్ కామెడీ చిత్రమట. ఈ నెలాఖరులో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ విషయాన్ని హీరో సందీప్‌కిషన్ కన్‌ఫామ్ చేశాడు.
సందీప్ కిషన్ ఈ సినిమాలో లాయర్‌గా కనిపించబోతున్నాడట. కూల్ అండ్ క్యూట్ గాళ్‌గా హన్సిక నటించనుంది. తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోంది. మరోవైపు హన్సిక నటించిన 'మహా' మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ఇటీవల విడుదలైన 'మహా' ప్రచార చిత్రాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.