ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే చిత్ర యూనిట్ ఏదో ఒక మీడియా ఛానెల్‌లో కూర్చొని ఆన్ లొకేషన్ తాము ఎదుర్కొన్న అనుభవాల్ని గురించి మాటల్లో వివరించేవారు. కానీ ఇప్పుడలా కాదు, ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రోమోల పేరు చెప్పి, ఎడిటింగ్ చేసిన వీడియోలు కాకుండా, ఆన్ లొకేషన్ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ సినిమా 'సాహో'కి సంబంధించి ఇలాగే మేకింగ్ వీడియోలు రిలీజ్ చేసి ఆశక్తి క్రియేట్ చేశారు.
తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'జెర్సీ' సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై సరికొత్త ఆశక్తిని కలిగిస్తున్నారు. ఏప్రిల్ 19న 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశాయి. అందులో భాగంగా లేటెస్ట్‌గా 'జర్నీ ఆఫ్ జెర్సీ' అంటూ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లక ముందే 70 రోజుల పాటు నాని ఎంతగా కష్టపడ్డాడో చూపించారు. ఇక షూటింగ్ సమయంలో ఒకానొక సందర్భంలో ముఖంపై గాయమై రక్తం కారిపోయే పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది నాని.
ఈ ప్రమోషన్‌లో చూపించిన ఎమోషన్‌కి నాని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వయసు క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లుక్స్ పరంగా నాని స్మార్ట్‌గా కనిపించడం లేదు..కానీ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తున్నాడు. కాస్త గెడ్డంతో, పైకి దువ్విన హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'జెర్సీ' రూపొందుతోంది.