బాక్సాఫీసు దగ్గర ఫ్లాపుల పరంపర కొనసాగుతూనే ఉంది. జనవరిలో ఒకే ఒక్క హిట్టు దక్కించుకున్న టాలీవుడ్.... ఫిబ్రవరిలో నూ హిట్టు కోసం తహతహలాడుతోంది. గత వారం విడుదలైన 'యాత్ర' ఓకే అనిపించుకున్నా.. వసూళ్ల పరంగా ఏమాత్రం నిలబడలేకపోయింది. ఈ వారం రెండు చిత్రాలు బాక్సాఫీసు ముందుకొచ్చాయి. 'దేవ్', 'లవర్స్' డే చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ప్రేమికుల రోజున విడుదలైన ఈ రెండు ప్రేమకథలూ పూర్తిగా నిరాశ పరిచాయి.
కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'దేవ్'. డబ్బింగ్ సినిమా అయినా సరే - కార్తి పై ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాపై నమ్మకాలు పెంచుకున్నారు. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. కానీ వాటిని `దేవ్` ఏమాత్రం అందుకోలేకపోయాడు. సాదాసీదా కథ, నీరసమైన కథనంతో ఉత్సాహాన్ని నీరు గార్చాడు. రివ్యూలు ఈ సినిమాని 'డిజాస్టర్' అని తేల్చేశాయి. వసూళ్లు కూడా అలానే వస్తున్నాయి. గత కొంతకాలంగా హిట్టు లేక విలవిలలాడుతున్న రకుల్‌కి మరో డిజాస్టర్ ఎదురైంది. ఈ సినిమాని రూ.6 కోట్లతో కొనుగోలు చేశారు తెలుగు నిర్మాతలు. ఇప్పుడు ప్రచార ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు `లవర్స్ డే` పరిస్థితి మరింత దారుణం. ప్రియా వారియర్ బొమ్మ చూసి ఈ సినిమాని మూడు కోట్లకు కొన్నారు నిర్మాతలు. ప్రియావారియర్ పోస్టర్ జనాల్ని థియేటర్లకు రప్పిస్తుందని నమ్మారు. కానీ ఫలితం శూన్యం. పేలవమైన కథ, కథనాలు, నాశిరకమైన టేకింగ్‌తో ఈ సినిమా నిరుత్సాహపరిచింది. ఒక్కటంటే ఒక్క మంచి సీన్ కూడా లేకపోవడం, ప్రియా వారియర్ పాత్రకు సైతం తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం `లవర్స్ డే` పై ప్రతికూల ప్రభావం చూపించాయి.
ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో ప్రేక్షకులు కనిపించడమే గగనం అయిపోయింది. అలా మొత్తానికి ఈ వారం కూడా వసూళ్ల గలగలలు వినిపించలేదు. 'హిట్' అనే మాట కనిపించలేదు. వచ్చే వారం 'ఎన్టీఆర్ - మహానాయకుడు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కనీసం బాలయ్య అయినా.. భళా అనిపిస్తాడేమో చూడాలి