టాలీవుడ్‌కి మళ్లీ కళొచ్చింది. వరుస పరాజయాల తరవాత... వసూళ్ల గలగలలు వినిపించడం మొదలయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన మజిలీ, చిత్రలహరి మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈవారం వచ్చిన జెర్సీ, కాంచన కూడా వసూళ్ల పరంగా రాణిస్తున్నాయి. నాని కథానాయకుడిగా నటించిన సినిమా `జెర్సీ`. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. 'చాలా కాలం తరవాత ఓ చక్కటి తెలుగు సినిమా చూశాము` అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
సాంకేతికంగా, నటీనటుల పరంగా.. ఈ సినిమా అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది. ఓ స్పోర్ట్స్ డ్రామాకి హ్యూమన్ ఎమోషన్స్ జోడించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాతో నాని కెరీర్‌లో మరో హిట్ పడినట్టైంది. నాని కెరీర్‌లోనో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా `జెర్సీ` నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రెండు రోజుల వసూళ్లు ఉత్సాహ భరింగా కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలోనూ, ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మరిన్ని మంచి వసూళ్లు రావడం ఖాయం.
ఇక బీ,సీ సెంటర్లను టార్గెట్ చేసిన `కాంచన` తన లక్ష్యాన్ని సాధించుకుంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ, కథానాయకుడిగా నటించిన చిత్రమిది. గత హారర్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టాయి. అందుకే కాంచన 3పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టాక్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా... కాంచన బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లోనూ దాదాపు 6 కోట్లు వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి.
ఆదివారం కూడా కాంచన 3కి మంచి వసూళ్లు లభించే అవకాశాలున్నాయి. కొన్ని ఏరియాల్లో జెర్సీ కంటే.. కాంచన 3కే వసూళ్లు ఎక్కువ లభించడం ఆశ్చర్యపరిచే విషయం. మొత్తానికి ఈ వారం కూడా బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. మజిలీ, చిత్రలహరి సినిమాలూ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. రెండింటికీ కొద్దో గొప్పో టికెట్లు తెగుతున్నాయి. అలా... థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి.