అటు శివాజీ రాజా - ఇటు నరేష్ ఇద్దరూ నువ్వా - నేనా అంటూ తలపడ్డారు. 'మా' ఎన్నికల కోసం. ప్రతీ రెండేళ్లకు ఓ సారి 'మా`'ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్షుడితో పాటు కార్య నిర్వాహక వర్గాన్ని `మా` సభ్యులు ఎంచుకుంటారు. దాదాపు 800 మంది సభ్యులున్న 'మా'లో దాదాపుగా ఎన్నిక ఏకగ్రీవంగానే జరపాలని చూస్తుంటారు. గతేడాది శివాజీ రాజా ప్యానల్ పోటీ లేకుండానే ఎన్నికైంది. ఈసారి మాత్రం నరేష్ బరిలో దిగడంతో పోటీ అనివార్యమైంది. రెండు ప్యానల్స్‌లోనూ పేరెన్నదగిన నటీనటులు బరిలో ఉండడం, ప్రచార వ్యూహాలతో రెండు జట్లూ.. అదరగొట్టడంతో ఈ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి.
రాజకీయ రంగంలో వర్గాలు, వాళ్లమధ్య తగాదాలు, ఎన్నికల సమయంలో వాగ్బాణాలు సందధించడాలు మామూలుగానే చూస్తుంటాం. ఆ వాతావరణం ఈసారి 'మా' ఎన్నికలలో కనిపించింది. ఎప్పుడూ లేనంత ఉత్కంఠత ఏర్పడింది. శివాజీరాజాపై నరేష్ వర్గం ఆరోపణలు చేయడం.. శివాజీ రాజా వాటిని తిప్పికొడుతూనే మీడియా సాక్షిగా కంటనీరు పెట్టడం. 'నరేష్ నన్ను అవమానించాడు' అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో ఈ వాతావరణం మరింత వేడెక్కింది.
నిజానికి నరేష్ బరిలోకి దిగినా... శివాజీరాజా ఎన్నిక దాదాపు లాంఛనమే అనుకున్నారంతా. ఎందుకంటే శివాజీరాజాకు పెద్ద తలకాయల అండ దండలున్నాయి. అయితే నాగబాబు సడన్‌గా ఎంట్రీ ఇచ్చి 'నేను నరేష్ ప్యానల్‌కి సపోర్ట్ చేస్తున్నా' అని ప్రకటించే సరికి.. ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. జీవిత, రాజశేఖర్‌లు కూడా పోటీ లో ఉండడం, ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఎవరు గెలుస్తారా? అనే ఉత్కంఠత నెలకొంది.
ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణ ఎలక్షన్స్‌ని తలపించాయి. మీడియా మొత్తం ఛాంబర్ దగ్గరే కాపు కాచింది. అర్థ రాత్రి వరకూ ఎన్నికల ఫలితాల్ని ప్రకటించే అవకాశం రాకుండా పోయింది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. అందరూ కలసి పని చేయాలి. 'మా' పురోభివృద్దిలో పాలు పంచుకోవాలన్నది చిరంజీవి మాట. ఆ మాటకు రెండు వర్గాలూ కట్టుబడి ఉంటే అంతకంటే కావల్సింది ఏముంది?