మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ 'మా'లో అధ్యక్ష పదవి కోసం రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. 'మా'లో మొత్తం సభ్యులు 745 మంది. రెండు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఒకటి నరేష్ ప్యానెల్. రెండోది శివాజీ రాజా ప్యానెల్. ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నది శివాజీరాజా. అయితే రెండో సారి పోటీ చేయకూడదని గతంలోనే తీర్మానించుకున్నారు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో శివాజీరాజా రెండోసారి పోటీ చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే పోటీ చేసిన ప్యానెల్స్ తరపున సాధారణ ఎలక్షన్స్ తరహాలో హామీలు గుప్పించేస్తున్నారు. తప్పు లేదు ఒకరి మీద ఒకరు పోటీగా హామీలివ్వచ్చు. కానీ ఆ హామీలకు తగ్గట్లు నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు.? ఆ సంగతి పక్కన పెడితే ఒకర్ని ఒకరు తిట్టుకోవడం ఎందుకు.? ఆ తర్వాత అందరూ కలిసి అక్కడ పని చేయాల్సిన వాళ్లే.
ఒకే సినిమాలో శివాజీ రాజా, నరేష్ ఇద్దరూ కలిసి నటించి రావచ్చు. 745 మంది సభ్యులతో పోటీ పడే ఎన్నికలకు మేం వాళ్లకి సపోర్ట్, మీరు వాళ్లకు సపోర్ట్ అంటూ అక్కడికేదో రాష్ట్ర వ్యాప్త ఎన్నికల్లా మీడియాకెక్కి మరీ రచ్చ చేస్తున్నారు. ఇదేం రాజకీయం.. ఇంత రాజకీయం అవసరమా 'మా'కి అంటూ సినీ పరిశ్రమలోనే పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.