ఈవారం విడుదలైన సినిమాల్లో `లవర్స్ డే` ఒకటి. ప్రియా వారియర్.. కన్నుగీటి సంచలనం సృష్టించిన వీడియో ఈ సినిమాలోనిదే. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒకే ఒక్క వీడియోతో సంచలనాలు సృష్టించిన ప్రియా వారియర్ ఈ సినిమాతో మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయమని జనాలు నమ్మారు. అందుకే... అసలు ఏమాత్రం ఆలోచించకుండా 'లవర్స్ డే' తెలుగు రైట్స్‌ని ఏకంగా 3 కోట్లు పోసి కొన్నారు.
ఇప్పుడు అందులో పావు వంతు కూడా తిరిగి రాబట్టడం అనుమానంగా మారింది. ప్రియావారియర్ మినహాయిస్తే.. ఈ సినిమాని ఇన్ని డబ్బులు పోసి కొనడానికి కారణమే కనిపించదు. ఈ సినిమా చూశాక... 'దీనికంటే షార్ట్ ఫిల్మ్స్ క్వాలిటీ చాలా నయం' అనే కామెంట్లు వినిపించాయి. అలాంటి సినిమాని 3 కోట్లకు కొన్నారంటే నిర్మాతల ధైర్యం చూసి ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ సినిమాని చూడకుండా అన్ని డబ్బులు పోశారంటే... తెలియకుండా రిస్క్ చేశారనుకోవొచ్చు. కానీ.. ఈ సినిమాని నిర్మాతలు చూసే కొన్నారట. చూసినప్పుడైనా ఈ సినిమాలో ఏం లేదన్న సంగతి నిర్మాతలకు అర్థం కాలేదా? అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక మీదట ఇలా వైరల్ అయిన సినిమాల్ని కొనేటప్పుడు నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిందే.