2019.. టాలీవుడ్ కి ఏమాత్రం కలసి రావడం లేదు. జనవరి లో 'ఎఫ్ 2' తప్ప అన్నీ ఫ్లాపులే. ఫిబ్రవరిలోనూ గట్టి మొట్టికాయలు తగులుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. గురువారం 'దేవ్', 'లవర్స్ డే' చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కార్తి నటించిన 'దేవ్'పై కాస్తో కూస్తో ఆశలు ఉండేవి.
అవన్నీ తొలి రోజే తుస్సుమన్నాయి. కథాకథనాల వల్లే ఈ సినిమా బోల్తా పడింది. ఒకే ఒక్క వీడియోతో వైరల్ అయిపోయింది ప్రియా వారియర్. ఆమె నటించిన సినిమా కావడంతో 'లవర్స్ డే' ఎలా ఉంటుందో చూద్దామన్న కుతూహలం పెరిగిపోయింది. అయితే.. ఈ సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది.
థియేటర్లకు వెళ్లిన వాళ్లు సగంలోంచే పారిపోతున్నారంటే.. ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఈ రెండు సినిమాలకూ వచ్చిన ఓపెనింగ్స్ అంతంత మాత్రమే. వచ్చేవారం 'మహానాయకుడు' విడుదల అవుతోంది. ఈ సినిమాపైనా ఎవ్వరికీ నమ్మకాల్లేవు. 'కథానాయకుడు' డిజాస్టర్ అవ్వడం, 'మహానాయకుడు' పబ్లిసిటీ ఇంకా మొదలవ్వకపోవడమే అందుకు కారణం.