టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పర్సనల్ లైఫ్ ని, సినిమా కెరీర్ ని కరెక్ట్ గా బాలన్స్ చేస్తూ కంప్లీట్ ఫామిలీ మ్యాన్ గా, స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మహేష్ కి ఉన్న ఈ సూపర్ స్టార్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, అప్పుడెప్పుడో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు కొలతలు తీసుకుని.. మహేష్ మైనపు బొమ్మని తయారుచేసిన విషయం తెలిసిందే.
త్వరలో, లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు బొమ్మని ప్రతిష్టించబోతున్నారు. అయితే.. అంతకన్నా ముందే ఈ ప్రతిమని హైదరాబాదులోనే అభిమానులు చూడొచ్చట. అది మరెక్కడో కాదు.. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో. హైదరాబాద్ లోని గచ్చిబౌలి-మియాపూర్ రోడ్డులో ఉన్న ఏఎంబీ సినిమాస్ లో మహేష్ మైనపు బొమ్మని ఒక్క రోజు ప్రదర్శనకి పెట్టనున్నారట.
దాంతో.. మహేష్ బాబు తో సెల్ఫీ తీసుకోవాలనుకునే అభిమానులు.. ఈ మైనపు బొమ్మను చూసి, ఫోటోలు కూడా తీసుకునే అవకాశం కల్పించనున్నారు. కాకపోతే.. ఇది ఏ రోజు జరుగుతుంది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సిఉంది. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.