తాజాగా మెగాస్టార్ చిరంజీవి కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' సినిమా చూడడం జరిగింది. మహేష్‌బాబు ఎఎంబీ సూపర్ ఫ్లెక్స్ ధియేటర్‌లో మెగాస్టార్ చిరంజీవి 'సైరా' టీమ్‌తో కలిసి ఈ సినిమా చూశారు. సినిమా చాలా బాగుందనీ, కంగనా రనౌత్ చాలా బాగా నటించిందనీ మెగాస్టార్ ప్రశంసల జల్లు కురిపించారు. విజువల్‌గా ఈ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించారని చిరంజీవి అన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా రూపొందిన చిత్రమిది.
లక్ష్మీభాయ్ చరిత్ర గురించి అందరూ పుస్తకాల్లో చదువుకున్నారు. క్రిష్, కంగనా పుణ్యమా అని ఆ వీరనారి చరిత్రను వెండితెరపై అద్భుతంగా వీక్షించే అవకాశం కలిగింది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న 'సైరా' కూడా ఈ తరహా చారిత్రాత్మక చిత్రమే కావడం విశేషం. అయితే లక్ష్మీభాయ్ చరిత్ర ఎంతో కొంత పుస్తకాల ద్వారానైనా తెలిసిన చరిత్రే. కానీ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లోని తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర మరుగున పడిపోయిన చరిత్ర.
తెలుగువాళ్లందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన ఈ చరిత్ర దురదృష్టవశాత్తూ మరుగున పడిపోయింది. ఈ చరిత్రనే తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు 'సైరా' టీమ్. సుదీర్ఘ కాలం పాటు ఓ స్పెషల్ టీమ్ రీసెర్చ్ చేసి ఈ సినిమాకి స్క్రిప్టు ప్రిపేర్ చేశారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. దసరాకి 'సైరా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బిగ్‌బీ అమితాబ్‌తో పాటు, సుదీప్, విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.