పాపం.. బోయపాటి శ్రీనుకి ఏదీ కలసి రావడం లేదు. ఎంతో కష్టపడి తీసిన `వినయ విధేయ రామ` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అవ్వడమే కాదు... బోయపాటి ఇమేజ్‌ని బోలెడంత డామేజ్ చేసేసింది. ఈ సినిమా తాలుకూ నష్టాల్ని నువ్వు కూడా భరించు అంటూ.. నిర్మాత గొడవ పడేంత వరకూ వెళ్లింది. ఆ తరవాత... నందమూరి బాలకృష్ణతో సినిమాకి పారితోషికంలో కోత పడింది.
ఇప్పుడు మైత్రీ మూవీస్ సంస్థ ఇది వరకు తామిచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వమంటోంది. అడ్వాన్సుతో సరిపెడితే పర్వాలేదు.. దానికి వడ్డీ కూడా కట్టమంటోందట. సినిమా వాళ్ల వడ్డీలు చాలా దారుణంగా ఉంటాయి. వందకు పది రూపాయలు తగ్గవు. అడ్వాన్సు తీసుకుని సినిమా చేయకపోతే.. దర్శకుల దగ్గర నిర్మాతలు ఇదే స్థాయిలో వసూలు చేస్తుంటారు. అప్పట్లో బోయపాటి శ్రీను మైత్రీ మూవీస్ దగ్గర కోటి రూపాయల వరకూ అడ్వాన్సు తీసుకున్నాడట. ఇది ఆరేళ్ల క్రితం మాట.
ఇప్పుడు వడ్డీలన్నీ కలిపి ఏడు కోట్లు దాటాయట. కోటి రూపాయలకు ఏడు కోట్లు కట్టడమేంటి? అన్నది బోయపాటి బెంగ. అంత మొత్తం ఇవ్వాల్సిందే, లేదంటే అర్జెంటుగా సినిమా చేయాల్సిందే అని మైత్రీ వాళ్లు అంటున్నారట. బోయపాటి బాలయ్యతో కమిట్ అయిపోయాడు కాబట్టి.. ఇప్పుడు మైత్రీ వాళ్లతో సినిమా చేయలేడు. కాబట్టి అడ్వాన్సు తిరిగి ఇవ్వాల్సిందే. ఇవ్వాలంటే వాళ్లు చెప్పినంత కట్టాలి. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాడు బోయపాటి.