బయోపిక్‌ల ప్రవాహం కొనసాగుతున్నప్పుడు ఏఎన్నార్ బయోపిక్ కూడా చర్చల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌లానే అక్కినేని బయోపిక్‌కీ బోలెడంత మార్కెట్ ఉంటుందని, తీస్తే తప్పకుండా ఆదరణ లభిస్తుందని అనుకున్నారు. అటు నాగచైతన్య గానీ, ఇటు సుమంత్ గానీ ఈ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని లెక్కలు గట్టారు. ఈ విషయంపై నాగార్జునని చాలాసార్లు మీడియా వర్గాలు ప్రశ్నించాయికూడా.
'ఎన్టీఆర్ బయోపిక్‌లా ఏఎన్నార్ బయోపిక్ తీస్తే బాగుంటుంది కదా' అని చాలామంది సినీ ప్రముఖులు నాగార్జున దగ్గర తమ మనసులోని మాట బయటపెట్టారు. కానీ నాగ్ మాత్రం ఏ రోజూ బయోపిక్‌పై మొగ్గు చూపించలేదు. 'ఏఎన్నార్ బయోపిక్‌లో డ్రామా కనిపించద'ని తేల్చేశాడు. ఆ ఉద్దేశం లేదని చాలాసార్లు క్లారిటీగా చెప్పాడు. 'ఎన్టీఆర్' బయోపిక్‌లా 'ఏఎన్నార్' బయోపిక్‌ని క్యాష్ చేసుకునే అవకాశాలున్నా.. ఆ దిశగా ఆలోచించలేదు.
నాగ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే..'ఎన్టీఆర్' బయోపిక్ వైఫల్యం తరవాత అసలు బయోపిక్‌ల ఆలోచనకే భయపడుతున్నారు సినీ జనాలు. ఎన్టీఆర్ బయోపిక్ మొదలెట్టిన ఊపులో ఏఎఎన్నార్ బయోపిక్ కూడా మొదలెడితే.. అక్కినేని నాగార్జున ఇప్పుడు చాలా టెన్షన్ పడేవాడు. మొత్తానికి తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు.