నందమూరి కథానాయకులు స్పీచులు ఇవ్వడంలో దిట్టలు. అందులో ఎన్టీఆర్ ఉన్నాడంటే.. స్పీకర్లు దద్దరిల్లిపోవాల్సిందే, మైకులు వణికిపోవాల్సిందే. నందమూరి బాలకృష్ణ సంగతి సరే సరి. ఎన్టీఆర్, బాలయ్య, కల్యాణ్ రామ్ ఒకే వేదికపైకి వచ్చారంటే.. ఇక అభిమానులకు పండగే. ముగ్గురూ కలసి స్పీచులు దంచికొడతారని ఆశిస్తారు.
'118' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి బాలయ్య, ఎన్టీఆర్ అతిథులుగా వచ్చారు. ఈ ముగ్గురూ కలసి మూడు నిమిషాలు కూడా మాట్లాడలేదు. దాంతో పాటు స్పీచులు కూడా చప్పగా సాగాయి. బాలకృష్ణ ఎప్పట్లానే ఈ సినిమా టైటిల్ విషయంలో కన్‌ఫ్యూజ్ పడ్డాడు. '118'ని కాస్త '189'గా మార్చి చెప్పాడు. ఎన్టీఆర్ మాటల్లో ముక్తసరి పదాలే ఎక్కువగా కనిపించాయి.
కళ్యాణ్ రామ్ కూడా అంతే. ఈ సినిమా విడుదలయ్యాక మాట్లాడతానని మైకు ఇచ్చేశాడు. బహుశా ఎన్టీఆర్ బయోపిక్ ఎఫెక్ట్ ఈ స్పీచులపై పడి ఉంటుంది. రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యేసరికి నందమూరి హీరోల్లో ఆనందం అనేది పూర్తిగా మాయమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడినా - ఓవర్ గానే ఉంటుందని అనుకున్నారేమో. గప్ చుప్‌గా వెళ్లిపోయారు.