సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠగా ముగిసిన మా అసోసియేషన్ ఎలక్షన్స్ అనంతరం గెలిచిన ప్యానెల్ కార్యవర్గం తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంది. ఇక్కడ మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేష్ మాటల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారంలో భాగంగా నరేష్ మాట్లాడిన ప్రతీ మాటలో 'నేను' అని మాత్రమే సంబోధించడం పట్ల రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'నేను' కాదు, 'మనం' అని నరేష్ తన మాటల్లో పేర్కొనాలి అని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడడం తనకిష్టం లేదనీ, అయినా తనకు మాట్లాడేందుకు ఏమీ లేదనీ, అన్నీ నరేషే మాట్లాడేశారనీ అలిగి మైక్ ఇచ్చేసి పక్కకి వెళ్లిపోయారు. నూతనంగా ఏర్పడిన మా కార్యవర్గంలో ఇంకా బాధ్యతలు చేపట్టకుండానే రేగిన ఈ అలజడి ఇతర మా సభ్యులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
కొద్ది సేపటికి తేరుకున్న రాజశేఖర్ మళ్లీ మైక్ అందుకుని మా అసోసియేషన్ ఎన్నికల కోసం అందరం కలిసే పని చేశాం. సో నరేష్ ఇక ముందైనా 'మనం' అని మాట్లాడితే బాగుంటుందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు పక్క నుండి నరేష్ నేనేదో సరదాకి అన్నాను.. మనమందరం కలిసే చేశాం. ఇకపై కలిసే అంతా చేస్తాం.. అని రాజశేఖర్‌ని సముదాయించే ప్రయత్నం చేశారు. అదీ 'మా' - 'మనం' మ్యాటర్.