పట్టుమని 800 మంది సభ్యులు కూడా లేని `మా` ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని మించి జరిగాయి. నువ్వా నేనా అంటూ ఇద్దరు తలపడ్డారు. కౌంటింగ్ దగ్గర టెన్షన్... టెన్షన్. అర్థరాత్రి స్వాతంత్య్రం ప్రకటించినట్టు... తెల్లవారుఝామునెప్పుడో రిజల్ట్ బయటకు వచ్చింది. అదేదో ముఖ్యమంత్రి సీటో, ప్రధాన మంత్రి పదవో ఇచ్చేసినట్టు నరేష్ అండ్ కో సంబరాలు చేసుకున్నారు. అప్పటి వరకూ శివాజీరాజా పార్టీలో ఉన్నవాళ్లు కూడా నరేష్ స్టెప్పులకు తాళాలు వేసి.. తీన్ మార్ ఆడారు. అక్కడితో 'మా' కథ సుఖాంతం అయిపోతే బాగుణ్ను.
'ఈ సీటు వదలను మొర్రో' అంటూ జీళ్ల కోసం చిన్నపిల్లాడు పట్టుబట్టినట్టు శివాజీరాజా పంతానికి దిగాడు. ఈనెల 31 వరకూ తాను 'మా' అధ్యక్షుడినే అని, ఆ సీటులో కూర్చునే సర్వాధికారాలు తనవే అని, కాదూ కూడదు అని ఎవరైనా ఎంటర్ అయితే.... కోర్టుకి వెళ్తానని సవినయంగా మనవి చేశారు శివాజీ రాజా. పోతే పోనీలె.. వెధవ సీటు... ఏప్రిల్ 1 నుంచి మనం హాయిగా అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవచ్చు- అని అనుకోకుండా.. 'అదేం కుదర్దు.. నాకు ఇప్పుడే కావాలి.. 'అంటూ నరేష్ అండ్ కో పేచీ పెడుతోంది.
ఇప్పటికే 'మా' పరువు బజారున పడింది. 'మా' అధ్యక్ష పదవి కోసం ఇన్ని కుట్రలా..? ఇన్ని కుతంత్రాలా? ఇన్ని వ్యూహాలా? అంటూ ఆశ్చర్యపోతోంది. వీళ్లలో వీళ్లు కొట్టుకుంటుంటే పెద్దలేం చేస్తున్నారు? అంటూ పెదవి విరుస్తోంది. ఇంత జరిగినా.. ఎవ్వరూ కిం అనడం లేదు. 'అరె.. చిన్న పిల్లల్లా కొట్టుకోకండ్రా.. 'అంటూ మందలించడం లేదు.
'అదే.. దాసరి నారాయణరావు ఉండి ఉంటేనా?' అనే మాటలు వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఆయన ప్రస్తావన అప్రస్తుతం. ఆ పెద్దరికం తీసుకునేంత ఓపిక, తీరిక ఇప్పుడు ఎవ్వరికీ లేవు. ఇవన్నీ చాలదన్నట్టు శివాజీరాజా ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మంగళవారం ఫిల్మ్ ఛాంబర్‌లో తన వాదన వినిపించబోతున్నాడు.
ఈసారి ఒంటరిగా వస్తాడా? మా ఎన్నికలలో నిలబడిన తన తోటివాళ్లని కూడా గుంపుగా తీసుకొస్తాడా? అనేది చూడాలి. ఇప్పటికే జరిగిన పెంట చాలు. దిగజారిన మా పరువు చాలు. ఇంకా దాన్ని రాచి రంపాన పెట్టకండి అనేది సినిమా వాళ్ల ఉవాచ. మరి దానికి శివాజీ రాజా పుల్ స్టాప్ పెడతాడో, లేదంటే ఈ ఆరని రావణ కాస్టంలో ఇంకొంచెం పెట్రోల్ పోస్తాడో చూడాలి.