లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సౌత్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయటానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. తాను నటించిన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్మాతలను అసంతృప్తి పరిచినా.. అప్పుడప్పుడు కానుకలు ఇస్తూ చిత్ర బృందంలో సాఫ్ట్ కార్నర్ తెచ్చుకుంటుంది.
నయన్ ప్రతీ సినిమా షూటింగ్ పూర్తవగానే టీం అందరికీ మంచి గిఫ్ట్ ఇచ్చే సంప్రదాయం పాటిస్తుందట. ఇటీవలే నయనతార - శివ కార్తికేయన్ జోడిగా నటిస్తున్న'మిస్టర్ లోకల్' చిత్రం షూటింగ్ ఈ నెల 6న చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా.. నయన్ చిత్ర యూనిట్ సభ్యులందరికీ స్పెషల్ బహుమతి ఇచ్చిందట. సినిమా సభ్యులందరికీ ఖరీదైన వాచ్ కానుకగా ఇచ్చి యూనిట్ వారందరినీ ఆనందింపచేసింది.
అప్పట్లో సావిత్రి గారు షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అందరికీ భోజనాలు పెట్టేవారట. ఈ తరం నటీనటుల్లో విజయ్, అజిత్ మరియు మహానటి కీర్తి సురేష్ కూడా ఇలా సినిమా సభ్యులందరికీ కానుకలు ఇస్తూ ఉంటారని తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ లిస్టులో నయనతార కూడా చేరింది. ఎమ్. రాజేష్ దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న 'మిస్టర్ లోకల్' చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది.