అమ్మాయిల వస్త్ర ధారణను ప్రశ్నించడానికి మీరెవరు.? అని మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎప్పటి నుండో అమ్మాయిల వస్త్రధారణపై పలు వివాదాలు తలెత్తుతున్నాయి. కానీ వాటికి విలువ ఉండడం లేదు. ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఓ క్యార్యక్రమంలో భాగంగా అమ్మాయిల వస్త్రధారణ, ముఖ్యంగా హీరోయిన్స్ వస్త్రధారణను తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తర్వాత 'దిక్సూచి' అనే ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కమెడియన్ బిత్తిరి సత్తి, శ్రీముఖిని ఉద్దేశించి వస్త్ర ధారణ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇదే విషయమై మహిళా సంఘాలు తీవ్రంగా గుస్సా అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా నాగబాబు స్పందన నెటిజన్లను కూడా ఆగ్రహానికి గురి చేసింది. బుల్లితెర యాంకర్స్ అనసూయ, రేష్మీలు నాగబాబుకు సపోర్ట్ చేస్తూ, ఆయనకు థాంక్స్ చెప్పారు.
కానీ నెటిజన్లు ఏమాత్రం ఊరుకోవడం లేదు. మీ అమ్మాయి నిహారికకు బికినీ వేసి ఐటెం సాంగ్స్ చేయిస్తావా.? మేము అమితంగా అభిమానించే మీ నుండి ఇలాంటి స్పందనను తట్టుకోలేకపోతున్నాం.. అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఈ రోజుల్లో సున్నితమైన అంశాల పట్ల ఎలా స్పందించినా కష్టమే. అమ్మాయిల తరపున నాగబాబు వకాల్తా పుచ్చుకోవడం తప్పు పట్టలేం కానీ, ఈ విషయంలో నాగబాబు స్పందన బెడిసికొట్టినట్లే అనిపిస్తోంది.