పీకల్లోతు ఫ్లాపులలో ఉన్న హీరోలలో నితిన్ ఒకడు. లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కల్యాణం.. ఇలా ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు ఓ సూపర్ హిట్ పడకపోతే... యువ హీరోల రేసులో నితిన్ పూర్తిగా వెనకబడిపోతాడు. ఇలా ఫ్లాపులు ఉన్నప్పుడు కథానాయకులు, నాయికలు పారితోషికాలు తగ్గించుకోవడం సర్వ సాధారణం. కానీ నితిన్ మాత్రం 'పారితోషికం తగ్గించే ఛాన్సే లేదు' అంటున్నాడట.
నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' అనే చిత్రం తెరకెక్కనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'ఛలో' తో ఆకట్టుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కోసం నితిన్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. 'ఫ్లాపులలో ఉన్నావ్ కదా.. పారితోషికం తగ్గించుకో' అని నిర్మాతలు అడుగుతుంటే నితిన్ ససేమీరా అంటున్నాడని టాక్. ఈ పారితోషికం విషయం తేలకపోవడం వల్లే `భీష్మ` ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని సమాచారం అందుతోంది.