హైదరాబాద్ లోని కొత్తగూడలో వెలసిన మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ ముందు నుంచీ వార్తల్లో నిలుస్తూనేఉంది. నగరంలోనే అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్సుల్లో ఒకటిగా నిలిచింది. ఈ మల్టీప్లెక్స్‌కి ప్రేక్షకుల తాకిడి ఎక్కువవుతోంది. అయితే ఇప్పుడు ఏఎంబీ మరో రూపంలో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్టుపై జీఎస్‌టీ తగ్గించిన సంగతి తెలిసిందే.
జీఎస్‌టీ తగ్గితే టికెట్టు రేటు కూడా తగ్గాల్సిందే. అయితే ఏఎంబీలో మాత్రం టికెట్టు రేటు తగ్గలేదని, యధావిధిగా ఇది వరకటి రేట్లకే టికెట్టు అమ్ముతున్నారని, అందుకే ఏఎంబీకి నోటీసులు కూడా ఇచ్చారని వార్తలొచ్చాయి. ఏఎంబీ భారీ మొత్తంలో పరిహారం కట్టాల్సివచ్చిందని గాసిప్పులు మొదలయ్యాయి. వీటిపై ధియేటర్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
తాము జీఎస్‌టీ రేట్లు తగ్గించే టికెట్లు అమ్ముతున్నామని, మాకు ఎలాంటి నోటీసూ రాలేదని యాజమాన్యం తెలిపింది. ఇటీవల అధికారులు తమ మాల్‌ని సందర్శించిన మాట వాస్తవమే అని, అయితే.. జీఎస్‌టీ రేట్లకూ దానికీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో... మహేష్ మల్టీప్లెక్స్ పై పుట్టిన ఈ వార్త కేవలం ఊహాగానమే అని తేలిపోయింది.