జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది 'ఎన్టీఆర్'. ఈ బయోపిక్‌లోని తొలి భాగం 'కథానాయకుడు' సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం జరగాల్సిన ఈ సినిమా సెన్సార్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాకి సెన్సార్ ఎందుకు జరగలేదు అనే విషయంపై పలు అనుమానాలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సెన్సార్ ఆఫీసర్ సెలవులో ఉన్నందు వల్ల 'కథానాయకుడు' సెన్సార్ ప్రక్రియ పూర్తి కాలేదని చిత్రబృందం చెబుతోంది. అయితే దానికి విభిన్నమైన వాదనలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. చివరి నిమిషాల్లో బాలకృష్ణ కొన్ని మార్పులు చెప్పడం వల్ల.. సెన్సార్ కాపీ రెడీ అవ్వలేదని, అందుకే ఈ సినిమా శనివారం సెన్సార్ ముందుకు వెళ్లలేకపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బాలకృష్ణ ఈ సినిమా సెన్సార్ విషయంలో ఓ ముహూర్తం నిర్ణయించారని, ఆ ముహూర్తం ప్రకారమే సెన్సార్ జరపాలని భావిస్తున్నారని, శనివారం సెన్సార్‌కి వెళ్లాల్సివున్నా.. ముహూర్తం సరిగా లేకపోవడం వల్ల సెన్సార్ ప్రక్రియ ఆగిపోయిందని టాక్. సోమ, మంగళవారాలలో సెన్సార్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మూడు వాదనల్లో ఏది నిజమో, ఏది అబద్దమో ఎన్టీఆర్ చిత్రబృందానికే తెలియాలి.