సంక్రాంతి రేస్‌లో ఉన్న 'ఎన్టీఆర్' బయోపిక్‌కి అన్ని వైపులా చుక్కెదురే కనిపిస్తోంది. సంక్రాంతి రేస్‌లో 'ఎన్టీఆర్'కి పోటీగా ఉన్న మిగిలిన రెండు సినిమాలూ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్లుగా వస్తున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు పదింతలయ్యాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
దాంతో పాటు, పవర్ ప్యాక్‌డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకునే చిత్రంగా బలమైన నమ్మకాన్ని కొట్టేశాడు వినయ విధేయ రాముడు. ఇకపోతే ఇదే రేస్‌లో దూసుకొస్తోన్న మరో చిత్రం 'ఎఫ్ 2'. ఇద్దరు స్టార్స్ వెంకీ, వరుణ్‌తేజ్‌ల మల్టీ స్టారర్ మూవీ ఇది. టీజర్ చూస్తే, పండక్కి ఈ ఇద్దరు హీరోలు పోటీపడి నవ్వించేయడం ఖాయమని తేలిపోయింది. పండక్కి కావాల్సిన అసలు సిసలు కంటెన్ట్ ఈ రెండు సినిమాల్లో పుష్కలంగా దొరుకుతోంది.
ఇక 'ఎన్టీఆర్' విషయానికి వస్తే, ఈ సినిమాకి ఇప్పటికే ఓ వైపు రామ్‌గోపాల్ వర్మ రూపంలోనూ, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు రూపంలోనూ వివాదాలు చుట్టుముట్టాయి. డైరెక్టర్ పరంగా క్రిష్‌పై ఎంత నమ్మకమున్నా, సినిమాలో విషయం ఉంటే కానీ, నిలదొక్కుకోవడం కష్టమే. విషయం విషయానికి వస్తే, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. కొత్తగా చూపించడానికి ఏముంటుందీ సినిమాలో అనేవారూ లేకపోలేదు. గతేడాది 'జై సింహా'తో బాలయ్య నిరాశపరిచారు. ఈ ఏడాదైనా 'ఎన్టీఆర్' ఆయనకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి..!