రూ.20 కోట్లు ఇస్తాన‌న్నా కాద‌న్నాడు!

By iQlikMovies - February 06, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 3లో హోస్ట్ ఎవ‌రు..?? - ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆస‌క్తి క‌లిగిస్తున్న ప్ర‌శ్న ఇది. బిగ్ బాస్ తొలి సీజ‌న్‌లో హోస్ట్‌గా క‌నిపించాడు ఎన్టీఆర్‌. త‌న వాక్ చాతుర్యంతో ఈ షోని ర‌క్తిక‌ట్టించాడు. టీఆర్‌పీల ప‌రంగా బిగ్ బాస్ షో కొత్త రికార్డులు సృష్టించింది. ఇదంతా ఎన్టీఆర్ మ‌హిమే. బిగ్ బాస్ 2 కోసం నానిని తీసుకున్నారు. బిగ్ బాస్ 2 కూడా హిట్టే. కానీ.. తొలి సీజన్ లా రికార్డులు సృష్టించ‌లేదు. హోస్ట్‌గా నాని కూడా కాస్త త‌డ‌బ‌డిన‌ట్టు అనిపించింది. 

 

అందుకే సీజన్ 3 కోసం ఎన్టీఆర్‌ని మ‌ళ్లీ తీసుకురావాల‌ని బిగ్ బాస్ టీమ్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించింది. ఎన్టీఆర్ కూడా దాదాపుగా ఓకే అన్నాడు. కానీ చివ‌రి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ - రామ‌చ‌ర‌ణ్ క‌ల‌సి `ఆర్‌.ఆర్.ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి సినిమా అంటే... కాల్షీట్లు గంపగుత్త‌గా ఇవ్వాల్సిందే. మ‌ధ్య‌లో బిగ్ బాస్ లాంటి వ్య‌వ‌హారాల‌కు అస్స‌లు టైమ్ ఉండ‌దు. అందుకే ఎన్టీఆర్ ఈ ప్ర‌తిపాద‌న సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌. 

 

చివ‌రికి రూ.20 కోట్ల పారితోషికం ఇస్తామ‌న్నా.. ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోలేద‌ని స‌మాచారం. బిగ్ బాస్ 1 సీజ‌న్‌కి ఎన్టీఆర్‌కి ఇచ్చిన పారితోషికం రూ.6 కోట్లు మాత్ర‌మే. ఇప్పుడు ఏకంగా మూడున్న‌ర రెట్లు అధికం అన్న‌మాట‌. అయినా స‌రే.. ఎన్టీఆర్ మాత్రం కింద‌కు దిగ‌లేద‌ని టాక్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌లా స్టార్ డ‌మ్‌, వాక్ చాతుర్యం ఉన్న మ‌రో స్టార్ కోసం బిగ్ బాస్ టీమ్ ఎదురుచూస్తోంది. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS