ఏప్రిల్ 11నే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఇక నెల రోజుల సమయం కూడా లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. దాదాపు అన్ని స్థానాలలోనూ జనసేన తరపునుంచి అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. ఇప్పటికే 130 మందితో తొలి జాబితా సిద్ధమైంది. అతి త్వరలో ఈ జాబితాని విడుదల చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది.
పవన్ రాజకీయ సభ ఎక్కడ జరిగినా.... `నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా` అని చెప్పడం రివాజుగా మారింది. చాలాసార్లు ఇలానే మాటిచ్చేశాడు జనసేనాని. పవన్‌కు ఉభయ గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది. అక్కడి నుంచి పవన్ పోటీ చేస్తారేమో అని అభిమానులు ఆశించారు. కానీ పవన్ మాత్రం `అనంతపురం నుంచి పోటీ చేస్తా` అని ఓ సందర్భంలో ప్రకటించారు. ఆ తరవాత పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆయన విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పవన్ నిలబడితే... భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనుకున్న స్థానం నుంచి.. ఆయన్ని పోటీకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడం వల్లే... ఈ జాగ్రత్త తీసుకోక తప్పదు. అయితే పవన్ మనసులో ఏముందో? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆయన సన్నిహితులకు కూడా అర్థం కావడం లేదు. 130 మందితో తొలి జాబితా సిద్ధం అవుతోంది కదా.. కనీసం ఆ జాబితా అయినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందోమో చూడాలి.