ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలేంటో తెలిసిపోయాయి. భీమవరం, గాజువాకల నుంచి జనసేనాని బరిలోకి దిగుతున్నాడు. ఈ నియోజక వర్గాల్లో పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక శాతంలో ఉన్నారు. కాబట్టి.. పవన్ ఈ రెండు స్థానాలలోనూ సులభంగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు చోట్లా పవన్ నామినేషన్ వేసే ముహూర్తం కూడా ఫిక్సయిపోయింది. గురువారం భీమవరంలో పవన్ నామినేషన్ వేయబోతున్నాడు. శుక్రవారం గాజువాకలో నామినేషన్ వేస్తాడు.
ఈ రెండు చోట్లా ఇప్పటికే పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. పవన్‌ని గెలిపించుకోవడం కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేయడం మొదలెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్‌ని భారీ మెజారిటీతో గెలిపించి, తమ అభిమానాన్ని చూపించాలని డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేటప్పుడు మద్దతుగా వేలాదిగా పవన్ అభిమానులు తరలి రానున్నారు. భీమవరం, గాజువాకలలో ఓ ప్రభంజనం చూడొచ్చన్నమాట.